The Prominent history of September 17th

0
305

సెప్టెంబర్‌ 17, 1948..

చరిత్ర తెలియని వారికి ఈ తేదీ ప్రాధాన్యం పెద్దగా తెలియకపోవచ్చు, కానీ చరిత్ర తెలిసిన వారి మనసు భావోద్వేగంతో నిండిపోతుంది. ఆనాటి స్వాతంత్య్ర సమరం, పోరాట యోధులు, త్యాగధనులను తలచుకొని వారికి నివాళులర్పిస్తారు.

అదే సమయంలో కొందరు ఈ తేదీ గురించి చెపితే ఉలిక్కిపడతారు. ఆత్మవంచన చేసుకుంటారు. ఈ తేదీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, మొండిగా వాదించే ప్రయత్నం చేస్తారు.

68 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా ఇదే రోజున భారతదేశం నడిబొడ్డున ఒక సర్జరీ జరిగింది. క్యాన్సర్‌ లాంటి కణితిగడ్డ తొలగిపోయింది.. 1948 సెప్టెంబర్‌ 17 నాడు విజాతీయ, ఫ్యూడల్‌ భావాలు గల హైదరాబాద్‌ సంస్థానం కాలగర్భంలో కలిసింది. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందారు. ఇది వాస్తవం. కానీ ఈ సందర్భానికి ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతారు. విమోచనం, విముక్తి, విలీనం. ఇలా రకరకాల పేర్లు పెట్టారు. కొందరు మహానుభావులు విద్రోహం అనే పేరు కూడా పెట్టేశారు.

తరతరాల బూజు

1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ సంస్థాన ప్రజల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్లయింది. తోటి భారతీయులు వేడుకలు జరుపుకుంటుంటే, ఇక్కడి ప్రజలు మాత్రం ఇంకా మధ్య యుగాలనాటి ఫ్యూడల్‌ రాచరిక పాలనలో మగ్గిపోవాల్సిన దుస్థితి.

బ్రిటిష్‌ వారు దేశం విడిచి వెళ్లిపోవడంతో, అప్పటివరకూ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్‌ సంస్థాన పాలకుడు అసఫ్‌జాహీ వంశస్తుడైన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తాను స్వతంత్రుడినయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్‌ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్‌లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ఫర్మానా జారీ చేశాడు. సంస్థానంలోని మెజారిటీ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నా నిజాం నవాబు పట్టించుకోలేదు.

‘మా నిజాం రాజు తరతరాల బూజు..’ తెలంగాణ వైతాళికుల్లో ఒకరైన ప్రముఖ కవి దాశరథి కష్ణమాచార్యులు రాసిన పద్యంలోనిది ఒక వాక్యం ఇది. ఈ ఒక్క వాక్యం నాటి హైదరాబాద్‌ రాజ్య పరిపాలనా స్వరూపానికి అద్దం పడుతుంది. ఈ సంస్థానం తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక అనే మూడు ప్రాంతాల స్వరూపం. ఈ సంస్థానంలో తెలుగు, మరాఠి, కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండేవారు. 85 శాతం ప్రజలు హిందువులే. కానీ పెత్తనం మాత్రం మతం, భాష రీత్యా అల్ప సంఖ్యాకులుగా ఉన్నవారిదే. మెజారిటీ సంఖ్యలో ఉన్న ప్రజల మతం, భాష, సంస్కృతి, సాంప్రదాయాలకు ఏ మాత్రం విలువలేదు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, పౌరహక్కులు అసలే లేవు, తీవ్రమైన అణచివేత. మాతభాషలో చదువుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఉర్దూ భాష పాలక భాషగా బలవంతంగా రుద్దబడేది. అది వచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు లభించేవి.

హైదరాబాద్‌ సంస్థానంలోని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఫ్యూడల్‌ పాలన కొనసాగింది. దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండే, జాగీర్దార్‌, దొరల దాష్టీకం తీవ్రంగా ఉండేది. గ్రామీణ ప్రజలు, రైతులు భూమి శిస్తు చెల్లించలేక వెట్టి చాకిరి, బానిసత్వంలో మగ్గిపోయే వారు.

మరోవైపు నరరూప రాక్షసులైన రజాకార్లు చెలరేగిపోయారు. వీరికి నిజాం ప్రభువు అండ దండలు పుష్కలంగా ఉండేవి. ఆ సమయంలో రజాకార్లు గ్రామాలపై పడి అరాచకాలు సష్టించారు. వారు చేసే లూటీలు, విధ్వంసాలు, హత్యలు నిత్య కత్యంగా మారాయి. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పురుషులను ఊచకోత కోసి, మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక దీన్‌దార్‌ అంజుమన్‌ అనే సంస్థ నిజాం ప్రభుత్వ సహకారంతో విచ్చల విడిగా మత మార్పిడులకు పాల్పడేది.

 

జాతీయోద్యమం

హైదరాబాద్‌ సంస్థాన ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించి, తన పాలనను సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించిన నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలు వినిపించాయి. శతాబ్దాల బానిస సంకెళ్లను తెంచుకునేందుకు సాగుతున్న స్వాతంత్య్ర సమరం ఊపందుకుంది. సంస్థానంలో నియంతత్వ పాలన అంతమై సంస్థానాన్ని దేశంలో విలీనం చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది. ఆరంభంలో ఆంధ్ర మహాసభ పేరిట ప్రారంభమైన సాంస్కృతిక, సామాజిక ఉద్యమం కాలక్రమంలో రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. ఆర్యసమాజం, స్టేట్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి.

భారత జాతీయ కాంగ్రెస్‌ సహకారంతో స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌ సంస్థానంలో పెద్ద ఎత్తున సత్యాగ్రహాలను నిర్వహించారు. నిజాం పరిపాలన నుండి విముక్తిని కోరారు. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ‘భూమి కోసం భుక్తి కోసం’ పేరిట పోరాటం చేసింది. అయితే రెండు జిల్లాలకు పరిమితమైన ఈ ఉద్యమాన్ని కాస్త భూతద్దంలో చూపిస్తారు కమ్యూనిస్టులు. కానీ హైదరాబాద్‌ విమోచనం జరిగిన తర్వాత కూడా ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను మాత్రం వారు స్పష్టంగా చెప్పరు.

అయితే ఈ పోరాటాలపై ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉక్కుపాదం మోపాడు. ఈ సంస్థలను నిషేధించడంతో పాటు రాజకీయ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయించి కఠిన శిక్షలు విధించాడు.

నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్యసమాజ్‌ పాత్ర చాలా అపురూపమైనది. నాటి కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నేతలు ప్రారంభంలో ఆర్యసమాజ్‌ ప్రభావం తోనే ఉద్యమ పంథాలోకి దిగారు. సాంస్కతిక, సామాజిక ఉద్యమాలపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఆర్యసమాజ్‌ మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తెచ్చే శుద్ధి కార్యక్రమాలను చేపట్టింది. దీనికి భయపడిపోయిన నిజాం ప్రభువు వెంటనే ఆర్య సమాజ్‌పై నిషేధం విధించాడు.

నారాయణరావు పవార్‌ నిజాం నవాబును అంతమొందించడానికి ఆయన కారుపై బాంబు విసిరాడు, ఆ బాంబు కారు డోరుకు తగిలి రోడ్డుపై పేలడంతో నిజాం బతికిపోయాడు. పవార్‌, అతని బృందాన్ని పట్టుకున్న పోలీసులు చిత్రహింసలు పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర నినాదంతో ధిక్కార స్వరం వినిపించింది. పోలీసుల ప్రతి లాఠీ దెబ్బకూ వందేమాతర నినాదం ఇచ్చి స్పహ తప్పిన రామచంద్రరావు కూడా ఆర్య సమాజీయుడే. అంతే కాదు.. స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ, హైదరాబాద్‌ సిటీ కాంగ్రెస్‌ నాయకుడు పండిత్‌ నరేంద్ర కూడా ఆర్యసమాజీయులే. దురదృష్టవషాత్తు అధికార చరిత్రకారులు హైదరాబాద్‌ విమోచన ఉద్యమంలో ఆర్యసమాజం పాత్రను తక్కువ చేసి చూపించారు.

 

పోలీసు యాక్షన్‌

బ్రిటిష్‌ వారు దేశం విడిచి పెట్టిన తర్వాత 552 స్వదేశీ సంస్థానాల్లో చాలావరకు భారతదేశంలో విలీనం అయ్యాయి. కొన్ని సంస్థానాలు మొండి కేయడంతో తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ వారిని నయానో భయానో ఒప్పించి దారికి తెచ్చాడు.

కానీ హైదరాబాద్‌ పాలకుడు నిజాం మాత్రం ‘యథాతథ స్థితి ఒప్పందం’ పేరిట నాటకాలు మొదలు పెట్టాడు. హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా కొనసాగించేందుకు పాకిస్థాన్‌ సాయం కోరాడు. చివరకు ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించాడు. సంస్థానంలో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితు లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చిన సర్దార్‌ పటేల్‌, పరిస్థితులు ముదరడంతో శస్త్రచికిత్సకు సిద్ధపడ్డారు.

మేజర్‌ జనరల్‌ చౌదరి నేతత్వంలో 1948 సెప్టెంబర్‌ 13న ఆపరేషన్‌ పోలో మొదలైంది. హైదరాబాద్‌ సంస్థానాన్ని మూడు వైపుల నుండి భారత సైన్యం చుట్టు ముట్టింది. ఇది పోలీస్‌ యాక్షన్‌గా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది.

పోలీసు యాక్షన్‌ ప్రారంభం కాగానే ‘భారత సైన్యాన్ని ఓడించి ఢిల్లీ ఎర్రకోట మీద అసఫ్‌ జాహీ పతాకాన్ని ఎగురవేస్తాం’ అని రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ విర్రవీగాడు. నిజాం సైన్యంతో పాటు రజాకార్లు కూడా యుద్ధంలోకి దిగారు. కానీ నిజాం సైన్యానికి అడుగడుగునా ఓటమే ఎదురైంది. ‘భారత సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తున్నాం, విజయం మనదే..’ అని దక్కన్‌ రేడియోలో ప్రతి రోజూ గోబెల్స్‌ను మించిన ప్రచారం కొనసాగింది. ఐదు రోజుల ప్రతిఘటన అనంతరం నిజాం సైన్యం చేతులెత్తేసింది. చివరకు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ లొంగుబాటు ప్రకటన చేశారు. అలా ఏడు తరాల అసఫ్‌ జాహీ పాలన నుండి హైదరాబాద్‌ సంస్థానం విమోచనం పొందింది. సెప్టెంబర్‌ 17, 1948 నాడు భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది.

 

వక్రభాష్యాలు ఎందుకు?

ఇది మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవ చరిత్ర. కానీ ఈ చరిత్రకు ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతారు. ఇది హైదరాబాద్‌పై భారత్‌ దురాక్రమణ అని, ముస్లింలు చిత్ర హింసలు ఎదుర్కొన్నారని ప్రచారం చేస్తున్నారు. నిజాం పాలన మరి కొంతకాలం సాగి ఉంటే, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం విజయవంతం అయ్యేదని కొందరి వాదన.

ఇంతటి స్ఫూర్తిమంతమైన మన హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్రకు మన విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చోటే లేకుండా పోయింది. అందువల్ల మన భావితరాలకు ఈ చరిత్ర తెలిసే అవకాశం లేకుండాపోయింది.

నిజానికి హైదరాబాద్‌ వాసులకు స్వాతంత్య్రం వచ్చింది 1948 సెప్టెంబర్‌ 17న. నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్‌ విమోచనం పొంది, భారత దేశంలో విలీనం కావడం చారిత్రక సత్యం.

హైదరాబాద్‌ విమోచనం అన్నా, తెలంగాణ విమోచనం అన్నా ఒకటే.

 

ఉత్సవాలు ఎందుకు జరపరు?

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1947 ఆగస్టు 15కు ఎంత ప్రాధాన్యం ఉందో, తెలంగాణ విమోచనం జరిగిన 1948 సెప్టెంబర్‌ 17కూ అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ రెండూ స్వాతంత్య్ర దినోత్సవాలే. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు ఏడు దశాబ్దాలుగా తెలంగాణ స్వాతంత్య్రదిన ఉత్సవాలకు నోచుకోలేక పోతున్నారు.

1956 నవంబర్‌ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నిజాం నుండి విమోచన లభించిన హైదరాబాద్‌ సంస్థానంలోని తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, మరాఠ్వాడాను బొంబే స్టేట్‌ (మహారాష్ట్ర) లోనూ, కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్‌ స్టేట్‌లోనూ విలీనం చేశారు.

ప్రతి ఏటా 17 సెప్టెంబర్‌ నాడు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పాత హైదరాబాద్‌ భూభాగాల్లో విమోచన వేడుకలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. కానీ పాత హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రధాన భాగమైన తెలంగాణ మాత్రం ఈ అదృష్టానికి దూరంగా ఉండిపోయింది.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ఏనాడూ హైదరాబాద్‌ విమోచన వేడుకలను నిర్వహించిన పాపాన పోలేదు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మార్గంలో కొనసాగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కె.చంద్రశేఖరరావు విమోచన ఉత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదంటూ నాటి ఆంధ్రప్రదేశ్‌ పాలకులను తప్పు పట్టారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ తెలంగాణ ఏర్పడి, స్వయానా కె.చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఇచ్చిన హామీని నిలుపుకోవడానికి జంకుతున్నారు. అందుకు కారణం సుస్పష్టం.

ఆనాటి రజాకార్ల పార్టీ మజ్లిస్‌తో కె.చంద్రశేఖర రావు పార్టీ టిఆర్‌ఎస్‌ స్నేహ బంధం మొదలు పెట్టింది. హైదరాబాద్‌ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తే వారు నొచ్చుకుంటారని టిఆర్‌ఎస్‌ భయం. అసలు తెలంగాణ విమోచన వేడుకలకు మతం రంగు పులమాల్సిన అవసరం ఏముంది? ఈ వేడుకలు ముస్లింలకు వ్యతిరేకం అని ఎవరన్నారు?

హైదరాబాద్‌ విమోచన ఉద్యమం ముస్లింలకు వ్యతిరేకం అనే అపోహలను కల్పించిన పాపం కేవలం ఓట్ల రాజకీయాలకు పాల్పడే కొందరు రాజకీయ నాయకులది మాత్రమే. ముస్లింలు కూడా నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని వారు మరచిపోతున్నారు.

నిజాం, రజాకార్ల దాష్టీకాలు, దమన నీతిని తన ‘రయ్యత్‌’, ‘ఇమ్రోజ్‌’ పత్రికల ద్వారా ఎండగట్టిన ముస్లిం పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్‌. అందుకు అతను అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. కమ్యూనిస్టు నాయకుడు మగ్దుం మొహియుద్దీన్‌, దొరల అరాచకాలపై ధిక్కార స్వరం వినిపించిన షేక్‌ బందగీ తదితరులు ముస్లింలు కాదా?

హైదరాబాద్‌ విమోచన వేడుకలను అధికారి కంగా నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతున్నట్లు? హైదరాబాద్‌ స్వాతంత్య్రాన్ని, ఆనాటి పోరాట యోధులను, త్యాగధనులను తలచుకునే అపూర్వ ఘడియల గురించి భావి తరాలు తెలుసుకోకుండా అడ్డంకులను ఎందుకు కల్పిస్తున్నట్లు?

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తమ సంకుచిత విధానాలు, మొండివైఖరిని పక్కనపెట్టాలి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా, రాజకీయాలకతీతంగా ఘనంగా నిర్వహించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here