Who is Ashtavakra?

0
313

 

 

గొప్ప ఋషులలో ఒకరే ఈ అష్టావక్రుడు. తల్లి కడుపులో ఉండగానే ఎన్నో శాస్త్రాలను అలవోకగా నేర్చేసుకున్న మహా జ్ఞాని. జనక మహారాజుకు, యాజ్ఞవల్కుడికి ఈయన గురువు. అష్టావక్రుడు కడుపులో ఉండగానే అష్ట వంకరలతో పుడతావనే శాపాన్ని పొందాడు. ఆ శాపాన్ని ఇచ్చింది కూడా ఎవరో కాదు అతని తండ్రి ఏకపాదుడే. అలాంటి మహర్షికి ఆటను పోయాకా స్వయానా శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడంటే అతని జన్మ ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది కదా.

వివరాల్లోకి వెళితే ఒకప్పుడు ఏకపాదుడనే గొప్ప తపస్వి ఒకరు ఉండేవారు. ఆయన భార్య పేరు సుజాత. ఆతను వేదవేదాంగాలు తెలిసినవాడు కావటంవల్ల ఎంతోమంది శిష్యులు అతని దగ్గర వేదాలు నేర్చుకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళకు గర్భవతి అయింది సుజాత. కడుపులో ఉన్న బాబు అన్ని వేదాలు తెలిసిన వాడు. అతను ఎప్పుడు చూసినా తండ్రి తన శిష్యులకు చెప్పే శాస్త్రాలను కూడా వింటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రి చెప్పే అభ్యాసంలో తప్పు దొర్లటంతో ఆగలేక, నాన్నగారు మీరు తప్పు చెప్తున్నారు, ఇలా చెప్పాలి అని ఎలా చెప్పాలో కూడా వివరిస్తాడు. అంతేకాదు విరామం లేకుండా అంతంత సేపు శిష్యులకి వేదాలు చెప్పకూడదు అని కూడా వివరిస్తాడు. దానితో ఆగ్రహించిన తండ్రి ఇప్పుడే ఇలా ఉంటే పుట్టాకా ఇంకా ఎన్ని తప్పులు ఎంచుతావో అని కోపగించి నువ్వు అష్ట వంకరలతో పుట్టుగాక అని శపిస్తాడు.

ఇంట్లో కావాల్సిన పదార్థాలు లేకపోవటంతో ఒకరోజు సుజాత ఏకపాదుడిని పిలిచి జనక రాజు దగ్గరకి వెళ్లి కావలసినవి అడిగి తెమ్మని చెపుతుంది. ఏకపాదుడు జనకుడి దగ్గరకి వెళ్ళే సమయానికి అక్కడ వరుణుని కొడుకైన వంది ఉంటాడు. వంది నాతో వాదించి గెలిస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఓడిపోతే మాత్రం జలదిగ్బంధం చేస్తాను అని అంటాడు. ఏకపాదుడు వందితో వాదించి ఓడిపోయి బందీ అయిపోతాడు.

కొన్నాళ్ళకు సుజాత అష్టావక్రుడికి జన్మనిస్తుంది. ఆరుణి అనే గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసేవాడు ఇతను. కాస్త పెద్దయ్యాకా తన తండ్రి గురించి తెలుసుకున్నఅష్టావక్రుడు జనకుని కొలువుకి వెళ్లి వందిని ఓడించి తన తండ్రిని విడిపించుకుని వస్తాడు. ఆ ఆనందంలో తండ్రి అతనిని అందంగా మారేలా వరమిస్తాడు. అలా అందంగా మారిన అష్టావక్రుడు సదాన్య మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకుంటాడు.

అష్టావక్రునికి పిల్లలు పుట్టాకా తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోతాడు. అతని దగ్గరకి రంభ మొదలైన అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. వారి నాట్యం చూసిన అష్టావక్రుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అందుకు వాళ్ళు విష్ణుమూర్తిని పొందాలన్న తమ కోరిక తీరేలా చూడమని అడుగుతారు. అందుకు అష్టావక్రుడు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తినపుడు మీ కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. ఆ అప్సరసలే ద్వాపరయుగంలో పుట్టిన గోపికలు.

అంతేకాదు గంగను భూలోకానికి తేవాలనుకున్న భగీరథుడు చాలా బలహీనంగా ఉండేవాడు. అతనిని బలంగా ఉండేలా చేసి గంగను భూలోకానికి తేవటంలో సహాయం చేసింది కూడా ఈ అష్టావక్ర మహర్షే. ఇలా ఎంతో మందికి కావాల్సిన సహాయాన్ని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. అతనిచే చెప్పబడిన అష్టావక్ర సంహిత రోజూ పారాయణ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.

అష్టావక్ర మహర్షి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఒకరోజు బృందావనంలో ఉన్న శ్రీకృష్ణుడిని చేరుకొని అతనిని స్తోత్రం చేసి ఆయన పాదాల దగ్గరే ప్రాణాలు విడిచారు. అతనికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అంత్యక్రియలు చేసాడు. ఇలా జన్మను విడిచిన అష్టావక్రుడు గోలోకానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here